Sri suktha Rahasyardha pradeepika    Chapters   

మండలి మాట

గిరా మాహుర్దేవీం ద్రుహిణగృహిణీ మాగమవిదో

హరేః పత్నీం పద్మాం హరసహచరీ మద్రితవయాం

తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా

మహామాయే విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి.

- శ్రీ సౌందర్యలహరి.

నలువరాణియగు వాణిగను, విష్ణుని సతియగు లక్ష్మి గను, శివు నిల్లాలగు పార్వతిగను భక్తులచే సేవింపఁబడి కామితార్థములను బ్రసాదించు చిచ్ఛక్తి ఒక్కటన్న ఒక్కటేగాని అనేకముకాదు. అది పరబ్రహ్మాభిన్నమైన బ్రహ్మశక్తి, 'సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా' (సాధకుల మేలుకొఱకై రూపరహిత బ్రహ్మవస్తువునకు రూపము కల్పింపఁబడెను.) అనెడు ఉపనిషదుక్తియు భక్తులచే నర్చింపఁబడు సర్వదేవతాస్వరూపములు నా సచ్చిదానందాకృతియగు బ్రహ్మమునకే వ్యాఖ్యానము లనుటను నిర్వచించుచున్నది.

అయినను ఉపాసకులనేకులు రూపమాదురియందె చిక్కుకొని, ఆరూప మే తురీయవస్తువును సూచించుచున్నదో దానిని గుర్తింపకయే సాధకపథమునం దగ్రగాములుగుటకు యత్నించుచున్నారు. ఇట్లగుటకుఁ గారణము-మంత్రస్తోత్రాదుల గంభీరార్థముల నెఱుంగకపోవుటయే. అర్ధజ్ఞాన రహితము లైన మంత్రజప - స్తోత్రపాఠములవలన సాధకుఁడు సంపూర్ణమైన సత్ఫలము నందఁజాలఁడు. అట్టివారిని గూర్చి శ్రీ భాస్కర రాయలువారు -

'ఉపమేయ శ్చక్రీవాన్‌ మలయజ భారస్య వోఢైవ.' (గంధపుఁగట్టెలను మోయు గాడిద వారి కుపమేయము కాఁదగినది) అనినారు.

అందుచే నుపాసకులకు మంత్రస్తోత్రాదుల యర్థ గ్రహణ మావశ్యకము. ఆ మహార్థములు శబ్దార్థములతో దేట తెల్లమగునవికావు. బ్రహ్మవేత్తయైన మహాపురుషుఁడు- ఇది 'యిట్టు'లని చెప్పవలెను; సాధారణులు దానిని గ్రహింపవలెను. అంతియేకాని అన్యధా సాధ్యముకాదు.

శ్రీకాములైనవారు శ్రీసూక్త ఋక్కులను పదునేనింటిని నిత్యము పారాయణ చేయుచుందురు. ఆఋక్కులతో ననుసంధించి శ్రీమాతకు షోడశోపచార పూజచేయుచుందురు. ఈ ఋక్కులలోనిమహార్థములను గమనించి సంస్కృతభాషలో ప్రాచీనులైన మహాపురుషులు వ్యాఖ్యానించిరి. కాని యా వ్యాఖ్యానము లందఱకును సుబోధకములుకావు. ఈ విషయమును గమనించియే బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు శ్రీసూక్త ఋక్కులకుఁ గల వ్యాఖ్యల నన్నిఁటి నరసి యరసి, స్వయముగా సిద్ధులైనందున స్వానుభవముతో మేళవించి యీ 'శ్రీసూక్త రహస్యార్థ ప్రదీపిక'ను 1952 సం.లో ప్రకటించిరి. అపుడు 'వేటవాకిలి' గ్రామమునందు నివసించుచున్న శ్రీ. గం. స. కాకర్లలక్ష్మమ్మగారు ఈ గ్రంథ ప్రాశస్త్యమును గమనించి శ్రీవిద్యోపాసక పండితాశీర్మాత్ర ఫలకాంక్షతో నీ గ్రంథమును బ్రకాశింపఁజేసిరి.

ఆ ప్రథమముద్రణ ప్రతులన్నియు నచిరాకాలముననే చెల్లిపోయినవి. గ్రంథముయొక్క ప్రశస్తతను జవిచూచిన పాఠకు లీ గ్రంథము కావలెననుట, లేదని సమాథానము వ్రాయుట చిరకాలమునుండి జరుగుచున్నందునఁ జింతితులై శ్రీశర్మగారు ఆశీర్వాద పురస్సరముగా ఈ గ్రంథమును మండలి కనుగ్రహించి ముద్రింపుఁడనిరి. తొలిముద్రణము నందు కంటె నీ మలిముద్రణమునందు 'ఉపాసనారహస్యము' అను అమూల్యము, సాధకుల కత్యంతోపకారము, శ్రీ శర్మగారి స్వానుభవభాసురము నగు వ్యాసరాజ మొండు చేర్పఁబడినది. శ్రీ శర్మగారి శ్రీచరణములకు నమస్కరించుచు, ఈ గ్రంథమును జదివి శ్రీ సూక్తరహస్యార్థములను గంఠమణులుగ ధరించి చెన్నొందుఁడని పాఠకలోకమునకు విన్నవించుచున్నాను.

తెనాలి ఇట్లు

సాదారణ-మాఘము బులుసు సూర్యప్రకాశశాస్త్రి

వ్యవస్థాపకులు; సాధన గ్రంధమండలి.

Sri suktha Rahasyardha pradeepika    Chapters